![]() |
![]() |
ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సాహో’, ‘కల్కి 2898ఎడి’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన దిశా పటాని ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఇప్పుడీ వార్త బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై రకరకాల కథనాలను పోస్ట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సివిల్ లైన్స్‌లోని విల్లా నంబర్ 40 దిశా పటాని నివాసం. సెప్టెంబర్ 12 తెల్లవారు జామున బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆ ఇంటిపై 7 రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
ఈ కాల్పులు తామే చేశామని గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా గ్యాంగ్ సభ్యులు వీరేంద్ర సరణ్, మహేంద్ర సరణ్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఒప్పుకున్నారు. ఆ పోస్ట్‌లో ‘సనాతన ధర్మాన్ని అవమానిస్తే చర్యలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఇది ట్రైలర్ మాత్రమే’ అని హెచ్చరించారు. దిశా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశా ఇంటి చుట్టూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. కాల్పులకు పాల్పడిన దుండగులు ఢిల్లీ..లక్నో హైవేపై పారిపోయారని, అంతకు ముందే ఆ ఇంటి దగ్గర రెక్కీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
దిశా ఇంటిపై ఇలా కాల్పులు జరగడానికి ఆమె సోదరి ఖుష్బు పటాని కారణమని తెలుస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన కామెంట్స్ వల్ల దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. జూలైలో హిందూ సాధువులైన ప్రేమానంద్ మహారాజ్, అనిరుద్ధాచార్య మహారాజ్‌పై ఖుష్బు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని తెలుస్తోంది. లివిన్ రిలేషన్‌షిప్స్‌పై అనిరుద్దాచార్య చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ ఖుష్బు కొన్ని వ్యాఖ్యలు చేసింది. దానిపై ఆగ్రహించి దిశా పటాని ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో దిశ సోదరి ఖుష్బు, తల్లిదండ్రులు ఉన్నారు. దిశ తండ్రి జగదీష్ పటాని రిటైర్డ్ డిఎస్పి. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి అపాయం జరగలేదు. దిశ ముంబైలో జరుగుతున్న ఒక షూటింగ్లో ఉండడంతో దాడి జరిగిన సమయంలో ఇంట్లో లేదు. ఇటీవలికాలంలో బాలీవుడ్ ప్రముఖులపై ఇలాంటి దాడులు అధికం అయ్యాయి. ఆమధ్య సల్మాన్ ఖాన్ ఇంటిపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దాడి చేసిన విషయం తెలిసిందే. అలాగే సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ దుండగుడు చొరబడి హడావిడి చేశాడు. ఇప్పుడు దిశా పటాని ఇంటిపై జరిగిన దాడితో బాలీవుడ్ ఉలిక్కిపడింది.
![]() |
![]() |